సోదరి గురించి

సెయింట్ కస్తూరి బహెన్ జీ 1926 సంవత్సరము సెప్టెంబర్ 26 తేదీన లఖింపూర్ ఖేరి (ఉత్తర ప్రదేశ్) నందు శ్రీ పండిట్ రాందాస్ చతుర్వేది, శ్రీమతి భగవతిదేవి పుణ్యదంపతులకు జన్మించారు.

కస్తూరి బహెన్ జీ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమును 1945 సంవత్సరములో పూర్తిచేసినారు. ఆమె చిన్న తనం నుండే సెయింట్ (సంత్) గుణాలతో భాసిల్లేవారు .

కస్తూరి బహెన్ జీ తండ్రిగారు మిగితా కుటుంబ సభ్యులు అందరు కూడ భగవదారాధకులు , భక్తి తత్పరులు. సంత్ లు , ఫకీర్లు తరచుగా వారి గృహానికి వచ్చి వెళ్లుతూ వుండేవారు. ఆమె తండ్రి గారు అయిన శ్రీ పండిట్ రాందాస్ చతుర్వేది గారు చాలా భక్తి, శ్రద్ధలతో ఆ సత్సంగాలలో పాల్గొనేవారు. ఆయన దానశీలి మరియు అందరికి కష్టములలో చాలా సహాయము చేసేవారు. పేద విధ్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఇచ్చి పాఠశాల ఫీజులను కట్టి, వారికి సహాయపడేవారు. వారి కుటుంబ సభ్యులు అందరు కూడ దైవ వర ప్రసాదితమైన సంగీతము, గాత్రము, రచనలో నిష్ణాతులు. వారందరు కూడ తరచు సాయంత్రం జరిగే భక్తి పూర్వకమయిన భజనలు, కీర్తనలు, గానములో పాల్గొని పరవశించేవారు.