జ్ఞానోదయం

స్పెషల్ పర్సనాలిటీ (విశిష్ట మూర్తి మత్వము ) అయిన శ్రీ బాబూజీ మహరాజ్ శుభ దర్శనానికి పూర్వమే బహెన్ జీ కి ఒక దివ్య సంఘటన అనుభవమయినది. 1948 సంవత్సరవము జనవరి నెలలో ఒక సాయంత్రము ఆమె ఆలోచనారహిత స్థితిలో ఆకాశాన్ని వీక్షిస్తున్నారు, హఠాత్తుగా ఒక కాంతి విస్తరిస్తూ వుండడము, ఆ ప్రకాశం మధ్యలో భగవాన్ శ్రీ రాముని రూపాన్ని ఆమె గమనించారు. కొద్ది సేపటికి ఆ రూపము అదృశ్యమై భగవాన్ శ్రీ కృష్ణుని రూపము ప్రత్యక్షమయినది. తరువాత అది కూడ మాయమై ఓం ప్రత్యక్షమయినది, కొంత సేపటికి అది కూడ అంతర్ధానమై, ఆ ప్రకాశంలో, సుకుమారమయిన రూపంతో అందమయిన, తెల్లని గడ్గం తో, ప్రకాశవంతమయిన మహా పురుషుడు దివ్య తేజస్సును విరజిమ్ముతూ కనిపించారు. ఎంతసేపు ఆ దృశ్యాన్ని వీక్షిస్తూ ఉండిపోయారో, మైమరచి పోయిన ఆమెకు తెలియలేదు. కానీ కొంతసేపటికి హఠాత్తుగా ఆమె, ఆకాశం మాములుగా ఉండడము గమనించారు. అప్పటినుండి కస్తూరి బహెన్ జీ అంతరంగం ఆమెకు తెలియకుండానే ఆ దివ్య రూపం కొరకు వెదుకుతూ నిరిక్షించ సాగినది.

ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చినది . అందులో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కాళికాదేవి ఆలయం ముఖ ద్వారం ముందు నిలబడి వున్నారు. ద్వారం దగ్గర అందమయిన తెల్లని గడ్గం తో ఒక దివ్య పురుషుడు నిర్మల ప్రశాంతతో నిలబడి వున్నారు. ఆ మహాపురుషుడు ఆమెకు ఒక ఖడ్గమును అందించినారు. ఆలయం లోనికి ప్రవేశించాలంటే ఆ ఖడ్గం తో ఆమె తన తలను ఖండించి, ఆ మహాత్ముని చేతికి ఇవ్వాలనే నిభందనను విధించినారు. వెంటనే మరియొక ఆలోచన లేకుండా, సోదరి కస్తూరీ, తన తలను ఖండించి ఆ మహాపురుషుని చేతిలో వుంచి, ఆలయం లోనికి ప్రవేశించినది. కానీ అక్కడ ఎటువంటి విగ్రహము లేదు. ఒక ప్రశాంతమయిన వాతావరణము నెలకొని వున్నది. ఆమె స్థితి కుడా దివ్యత్వంతో నిండి వున్నది. కల అంతటితో అంతమయినది. కానీ ఆ దృశ్యము నిద్ర లేచిన తరువాత కూడ ఆమె స్మృతి పధం నుండి తొలగిపోలేదు.

తరువాత రోజు అంటే 1948 సంవత్సరము జనవరి ౩ వ తారీఖు సాయంత్రము బహెన్ జీ జీవితంలో అత్యంత ఆశ్చర్య కరమయిన సంఘటన జరిగినది. పూజ్య శ్రీ బాబూజీ మహరాజ్ వారి గృహమునకు విచ్చేసినారు. శ్రీ బాబూజీని చూసి ఆమె ఆశ్చర్య చకిత అయినారు. ఎందుకంటే ఆయనే అంతకు ముందు రోజు ఆకాశం లో దర్శనం ఇచ్చిన దివ్య పురుషుడు. పరిపూర్ణ మార్గదర్శి కోసం ఆమె నిరీక్షణ ఫలించినది. ఆశ్చర్య, అనురాగాలతో బహెన్ జీ , “ఓ బాబూజీ ! ఇంతకాలం నేను మీ గురించే వెదుకుతున్నాను” అని అన్నారు. దానికి బాబూజీ, ” బిటియా నేను కూడ నీ గురించే వెదుకుచున్నాను. ఇప్పటికి నీవు కనిపించినావు” అని అన్నారు. ఈ విధంగా మొదటి సారి కస్తూరి బహెన్ జీ, శ్రీ బాబూజీ మహరాజ్ ను ఆమె ఇంటి దగ్గర కలుసుకొన్నప్పుడు దివ్య ధారా ప్రవాహం సంభాషణ రూపంగా మొదలయినది.

సాధారణముగా శిష్యుడు గురువును వెదుకుతూ ఆయనను చేరుతాడు . కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రము సద్గురువే స్వయంగా తన ప్రియ శిశ్యుని గురించి, శిశ్యుని గృహానికి వెల్లడమనేది చాలా అరుదుగా సంభవిస్తుంది. ఈ విధంగా 1948 సంవత్స రము నుండి ఆమె ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమయినది. బహెన్ జీ తన ఆధ్యాత్మిక అనుభవాలను వ్రాసుకొని వాటిని ఉత్తరాల ద్వార శ్రీ బాబూజీ కి తెలియ పరిచే వారు. శ్రీ బాబూజీ కూడ ఆమె ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమయిన సూచనలు చేస్తూ జవాబులు ఇచ్చెవారు . శ్రీ బాబూజీ మహరాజ్ మరియు కస్తూరీ బహెన్ జీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు మానవాళికి వారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జ్ఞాన సంపద వాటిని “అనంతయాత్ర “ అనే పేరుతో 5 భాగాలుగా ప్రచురించినారు. బహెన్ జీ వ్రాసిన అన్ని గ్రంధాలు, రచనలు కూడ శ్రీ బాబూజీ మహరాజ్ ఆమెకు ప్రసాదించిన ఆధ్యాత్మిక దివ్య అనుభూతులు, స్థితులు మాత్రమే.